: సచిన్ కొడుకుననే గర్వం లేదు... హోటల్ లో ఆమ్లెట్లు వేశాడు!
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ కు తానో దిగ్గజ క్రికెటర్ కుమారుడినన్న గర్వం కాస్తంతైనా లేదని భోపాల్ లోని ఓ హోటల్ సిబ్బంది ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అర్జున్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు రెండురోజుల పర్యటన నిమిత్తం వెళ్లాడు. ఈ సందర్భంగా ఓ స్థానిక హెటల్ లో బసచేసిన అర్జున్ కిచెన్ లో దూరి వెరైటీ ఆమ్లెట్లు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీంతో హోటల్ సిబ్బంది అర్జున్ కలుపుగోలుతనాన్ని మెచ్చుకున్నారు. సచిన్ కొడుకుననే గర్వం కించిత్తైనా లేదని, అర్జున్ తమతో చాలా బాగా కలిసిపోయాడని హోటల్ సిబ్బంది ప్రశంసించారు. సచిన్ కూడా అప్పుడప్పుడు ఇంట్లో గరిటె తిప్పుతాడన్న విషయం తెలిసిందే. సచిన్ చికెన్ కర్రీలో పలు వెరైటీలు అద్భుతంగా వండుతాడని టీమిండియా సహచరులు పేర్కొంటారు. మొత్తానికి అర్జున్ కు ఆటలోనే కాదు, గరిటె తిప్పడంలో కూడా తండ్రే ఆదర్శం అన్నమాట.