: అంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారా?: సోనియాపై తోట నరసింహం ఫైర్


ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, అప్పటి కేంద్ర మంత్రులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ ఎంపీ తోట నరసింహం విమర్శించారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సాక్షిగా ఎంపీలను కొట్టి, మైకులు ఆపేసి, ఏపీ నేతల నోర్లు మూయించి, భౌతిక దాడులకు పాల్పడి ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసిన ఘటన అందరికీ గుర్తుందని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, అప్పటి కేంద్ర మంత్రులు, నేతలు ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని లేక, నీరు లేక, సరైన మౌలిక వసతులు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నచ్చకే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని ఆయన స్పష్టం చేశారు. నాలుగు కోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ గడ్డిపోచలా తీసేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ నేతైనా అంగీకారం తెలిపాడా? అని నిలదీశారు. మా ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, మా రాష్ట్రాన్ని ఎలా విభజించారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News