: టీఆర్ఎస్ నేతలు దేశంలోనే ఉన్నామన్న విషయం గుర్తుంచుకోవాలి: సౌగత్ రాయ్
టీఆర్ఎస్ నేతలు భారతదేశంలోనే ఉన్నామన్న విషయం గుర్తుంచుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సౌగత్ రాయ్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నేను ఈ మధ్య హైదరాబాదుకు వెళ్లాను. ఆ సమయంలో ఏపీ సీఎం తెలంగాణలో యాత్ర జరపాలని నిర్ణయించుకున్నారు. దానిపై ఓ తెలంగాణ మంత్రి మాట్లాడుతూ 'ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తెలంగాణలో తిరగనివ్వం. ఆయనకు ఇక్కడ ఏం పని?' అని ప్రశ్నించడం చూశాను. అది దురదృష్టకరం" అన్నారు. భారతదేశంలోని వ్యక్తులు ఎవరైనా, ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు, నేతలు అన్నదమ్ముల్లా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇవ్వాలని ఆయన సూచించారు. రాజధాని కోసం పచ్చని భూములు సేకరించారని, అయితే, అది వారి ఇష్టమని ఆయన చెప్పారు. విభజన కారణంగా తీవ్ర దుర్భిక్షంలో కూరుకుపోయిన ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.