: ఆంధ్రప్రదేశ్ పై 'అమ్మ' మాట్లాడారు!
ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులపై తొలిసారి నోరెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా యూపీయే ప్రభుత్వం పలు హామీలు ఇచ్చిందని అన్నారు. ఆయా హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉందా? లేదా? అని ఆమె నిలదీశారు. ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వేజోన్, పెట్రోకెమికల్ కారిడార్, పెట్రొకెమికల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ యూనివర్సిటీ, వైజాగ్ నుంచి చెన్నై వరకు హైస్పీడ్ రైలు సౌకర్యం, పోలవరం ప్రాజెక్టు, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నామని అన్నారు. దీనిపై తాను ప్రధానికి రెండుసార్లు ఉత్తరాలు రాశానని గుర్తు చేశారు. అధికారం చేపట్టి 9 నెలలు పూర్తయినప్పటికీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు. తక్షణం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.