: నిజాయతీపరులను రక్షించేందుకు ఓ వ్యవస్థ కావాలి: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి ప్రస్తుత వ్యవస్థ తీరుతెన్నులపై స్పందించారు. దేశంలోని నిజాయతీపరులైన రాజకీయనేతలు, అధికారులు, వ్యాపారవేత్తలను కాపాడుకునేందుకు ఓ సమర్థ యంత్రాంగం రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. స్వచ్ఛశీలురు తమతమ పనులను నిర్భీతిగా చేసుకునేందుకు తగిన వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బొగ్గు గనుల కేటాయింపుల వ్యవహారంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బొగ్గు స్కాం పౌర సేవకులను భయాందోళనలకు గురిచేస్తోందా? అన్న మీడియా ప్రశ్నకు జవాబిస్తూ, భీతావహ వాతావరణం నెలకొంటే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకుపోదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని, నిజాయతీపరుల రక్షణ అంశం కూడా తక్షణ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. బొగ్గు స్కాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, హిందాల్కో చీఫ్ కుమార మంగళం బిర్లా తదితరులకు కోర్టు సమన్లు జారీచేయడం తెలిసిందే. కుమార మంగళం బిర్లా తనకు ఎంతోకాలం నుంచి తెలుసని, అతను మంచివాడని నారాయణమూర్తి కితాబిచ్చారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో, దోషులుగా తేలేవరకు వారిని తప్పుబట్టడం సరికాదని అన్నారు.