: ఓయూలో మళ్లీ ఉద్రిక్తత... ఎన్ సీసీ గేటు వద్ద యుద్ధ వాతావరణం
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరిగిన సమయంలో ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైన ఉస్మానియా యూనివర్సిటీలో మరోమారు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్యోగాల భర్తీ కోసం వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం అయ్యాక ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయింది. నెలల తరబడి ఉద్యోగ ప్రకటనల కోసం వేచి చూసిన నిరుద్యోగులు నేడు భగ్గుమన్నారు. తక్షణమే నోటిఫికేషన్లను జారీ చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం వందలాది మంది విద్యార్థులు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్ సీసీ గేటు దాకా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ఎన్ సీసీ గేటు వద్దకు చేరగానే విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.