: తాజ్ మహల్ కు మరో ఘన కీర్తి... ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ లో అగ్రస్థానం
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలచిన తాజ్ మహల్ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చారిత్రక కట్టడం మరో అరుదైన ఘనతను చేజిక్కించుకుంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ఆసియా ఖండంలోని కట్టడాల జాబితాలో అగ్రస్థానంలో తాజ్ మహల్ నిలిచింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్ లో ఈ విషయం తేలింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్ లో అత్యధిక మంది పర్యాటకులు తాజ్ మహల్ కోసమే వెతికారు. ఈ మేరకు ఆసియాలోని ఇతర దేశాల్లోని కట్టడాలతో పోల్చి చూస్తే, తాజ్ మహల్ ను చూడటానికే ప్రపంచ పర్యాటకులు ఆసక్తి కనబరిచారని గూగుల్ ప్రకటించింది. తాజ్ మహల్ తో పాటు దేశంలోని కుతుబ్ మినార్, ఎర్రకోట, ఆగ్రా కోట, లావాసా, లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ, హుమయూన్ సమాధి, షాణివార్ వాడా, జంతర్ మంతర్, ఐఐటీ బాంబే తదితరాలను కూడా చూసేందుకు ప్రపంచ పర్యాటకులు ఆసక్తి చూపారని గూగుల్ వెల్లడించింది.