: మాజీ పీఎం మనవడు హీరోగా, మాజీ సీఎం నిర్మాతగా... కన్నడనాట భారీ బడ్జెట్ చిత్రం


నిజమేనండోయ్, కన్నడనాట త్వరలో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ చిత్రంలో మాజీ పీఎం మనవడు, మాజీ సీఎం పుత్రరత్నం తెరంగేట్రం చేస్తున్నాడు. భారత సినీ జగత్తులో సూపర్ స్టార్లుగా ఎదిగిన అగ్రనటుల సంతానంతో పాటు పలువురు రాజకీయ వేత్తల పుత్రరత్నాలు కూడా తెరంగేట్రం చేసి ఘన విజయాలే సాధించారు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడు రితేశ్ దేశ్ ముఖ్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. తాజాగా అతడి బాటలోనే నడుస్తున్నాడు నిఖిల్ గౌడ. ఎవరీ నిఖిల్ గౌడ అనేగా మీ సందేహం. భారత మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మనవడిగానే కాక, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పుత్రరత్నంగా కన్నడిగులకు నిఖిల్ బాగానే తెలుసు. తన పుత్రరత్నాన్ని సినీ జగత్తులోకి పంపేందుకు కుమారస్వామి పెద్ద కసరత్తే చేస్తున్నారట. రూ.60 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట. రాజకీయాల్లోకి రాకముందు కుమారస్వామి సినీ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఆ అనుభవంతోనే తన పుత్రరత్నం సినిమాతో మరోమారు ఆయన నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. ఈ విషయాన్ని కుమారస్వామే ఇటీవల వెల్లడించారు. యాక్టింగ్, డ్యాన్స్ లలో ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న నిఖిల్, తెరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు.

  • Loading...

More Telugu News