: పరువునష్టం కేసులో నేడు కోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... డిప్యూటీ సీఎం కూడా!
పరువునష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు కోర్టు ముందు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆప్ పోటీ చేసిన తొలి ఎన్నికల్లో తనకు టికెట్టిస్తున్నట్లు తొలుత ప్రకటించి, ఆ తర్వాత నిరాకరించడం ద్వారా తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ న్యాయవాది సురేందర్ కుమార్ శర్మ... కేజ్రీవాల్ సహా, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, నాడు పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన యోగేంద్ర యాదవ్ లపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేజ్రీవాల్, సిసోడియా, యోగేంద్రలకు సమన్లు జారీ చేశారు. అయితే ఆ ముగ్గురూ కోర్టు ముందు హాజరుకావడంతో న్యాయమూర్తి నాడు వారికి బెయిల్ మంజూరు చేశారు. నేడు ఈ దావాపై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కేజ్రీవాల్, సిసోడియా, యోగేంద్రలకు సమన్లు జారీ అయ్యాయి. దీంతో కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యే అవకాశాలున్నాయి.