: ఏపీలో ఎక్కడికక్కడ అరెస్టులు... అంగన్ వాడీల 'చలో హైదరాబాదు'లో ఉద్రిక్తత!
కనీస వేతనాల కోసం ఉద్యమ బాట పట్టిన ఏపీ అంగన్ వాడీలు నేడు 'చలో హైదరాబాదు' ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో పాల్గొనేందుకు ఏపీలోని పలు జిల్లాల నుంచి వందల సంఖ్యలో అంగన్ వాడీ కార్యకర్తలు నిన్న రాత్రి హైదరాబాదుకు బయలుదేరారు. అయితే దీనికి అనుమతి లేదని చెబుతున్న పోలీసులు, ఆందోళనకారులను హైదరాబాదులో అడుగుపెట్టనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అక్రమంగా తమను నిర్బంధించిన పోలీసులు, తమపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టుల పర్వంతో ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.