: యువీ బౌలింగ్ వరల్డ్ కప్ లో సూట్ కాదు... అందుకే దూరం పెట్టా: ధోనీ
రెండోసారి టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర ఎనలేనిది. బ్యాటుతోపాటు బంతితో రాణించిన యువీ వరల్డ్ కప్ లో 15 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి సత్తాచాటాడు. తాజా వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ను పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. వన్డేల్లో మారిన ఫీల్డింగ్ పరిమితుల నేపథ్యంలో యువరాజ్ సింగ్ బౌలింగ్ జట్టుకు లాభించే అవకాశం లేదని అన్నాడు. కావాలంటే మారిన రూల్స్ ను ఓసారి చూడాలని చెబుతున్నాడు. రూల్స్ మారిన తరువాత యువీ పెద్దగా బౌలింగ్ చేయలేదని అన్నాడు. టీ 20ల్లో బౌలింగ్, అతని రెగ్యులర్ మ్యాచ్ ల బౌలింగ్ పై ప్రభావం చూపిందని చెప్పాడు. నిబంధనలు మారిన తరువాత 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో యువీ బౌలింగ్ తో ప్రభావం చూపే అవకాశం ఉండదని బావించానని ధోనీ తెలిపాడు. యువీ స్థానాన్ని సురైష్ రైనా భర్తీ చేయగలడని ధోనీ తెలిపాడు. కాగా, ఆల్ రౌండర్ ఖాతాలో యువీస్థానంలో చోటు కల్పించిన జడేజా మాత్రం రాణించడం లేదు. అయినప్పటికీ ధోనీ... జడేజాను కొనసాగించడం గమనార్హం. గడచిన 12 వన్డేల్లో జడేజా పెద్దగా పరుగులు చేసింది లేదు.