: సభ్యత్వాల ద్వారా రూ. 9.26 కోట్లు వచ్చాయి... ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ: కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వాల ద్వారా 9.26 కోట్ల రూపాయలు సమకూరాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ భవన్ లో శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, సుమారు 50 లక్షల మంది టీఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకున్నారని అన్నారు. ఆన్ లైన్ ద్వారా 38 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఆన్ లైన్ లో సభ్యత్వ నమోదుకు 15 నిమిషాల సమయం తీసుకుంటుందని చెప్పిన ఆయన, మరో రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. ఏప్రిల్ 24న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. అదే రోజు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఆయన వివరించారు. అనంతరం ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ లోపు గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.