: చిన్న జట్లకు ప్రాతినిధ్యం వహించినా భారీగా రాణించారు!
వరల్డ్ కప్ లీగ్ దశలో పలు చిన్న జట్లు శక్తి మేర ఆడి పెద్ద జట్లను వణికించాయి. జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్ లాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ జట్లు ప్రత్యర్థులకు దడపుట్టించాయి. బంగ్లాదేశ్ జట్టు లీగ్ దశను దాటి నాకౌట్ కు చేరుకుని చిన్నజట్టుగా భావించవద్దని హెచ్చరికలు పంపుతోంది. కాగా, ఏమాత్రం అవకాశం లేని దశ నుంచి స్కాట్ లాండ్ పై ఆఫ్ఘన్ జట్టు విజయం సాధించడం ఆ జట్టు పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది. ఆయా జట్ల ఆటగఆళ్లు కూడా విశేషంగా రాణించారు. సమీముల్లా షెన్వారీ 96 పరుగులతో సత్తా చాటి వరల్డ్ కప్ లో తొలి విజయం అందిస్తే, పేసర్ హమీద్ హాసన్ 8 వికెట్లు తీసి టోర్నీలో అందర్నీ ఆకట్టుకున్నాడు. స్కాట్లాండ్ తో పోరులో షాపూర్ జద్రాన్ 10 బంతుల్లో చేసిన 12 పరుగులు సోషల్ మీడియాను వేడెక్కించాయి. యూఏఈ జట్టు నుంచి షాయిమాన్ అన్వర్ 311 పరుగులు చేసి వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల టాప్ టెన్ జాబితాలో స్థానం సంపాదించాడు. స్కాట్లాండ్ బౌలర్ జోష్ డేవీ 15 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల టాప్ టెన్ జాబితాలో 4వ స్ధానం సాధించాడు. జింబాబ్వే ఆటగాళ్లు బ్రెండన్ టేలర్ (433), షాన్ విలియమ్స్ (339) పరుగులతో టాప్ టెన్ లో నిలిచారు. బంగ్లా బ్యాట్స్ మన్ మహ్మదుల్లా 344 పరుగులతో టాప్ 5 బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు. లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో, ఇక నాకౌట్ దశలో ఎలాంటి విన్యాసాలు నమోదవుతాయో చూడాలి.