: బండ్ల గణేశ్ 'మెగా' వ్యాఖ్యలు దాసరిని ఉద్దేశించేనా?
సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకకు విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు తనదైన శైలిలో వ్యాఖ్యానించడం తెలిసిందే. స్టైల్ విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత అంతటివాడు పవన్ కల్యాణే అని అన్నారు. యువ హీరోలు పవన్ ను అనుకరిస్తున్నా అల్లు అర్జున్ మాత్రం స్వంత శైలి ఏర్పరచుకున్నాడని కితాబిచ్చారు. ఈ సందర్భంగా దాసరి ఎక్కడా చిరంజీవిని ప్రస్తావించకపోవడం గమనార్హం. తాజాగా, నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా చేసిన పలు వ్యాఖ్యలు ఆసక్తిగొలుపుతున్నాయి. రాముడులేని రామాయణం చదవలేమని, చిరంజీవి పేరులేని టాలీవుడ్ గురించి మాట్లాడలేమని కాస్త ఘాటైన ట్వీట్ చేశారు. తెలుగు క్యాలెండర్ లో పండుగ తేదీలు ఉంటే, చిత్రసీమ క్యాలెండర్ లో చిరంజీవి సినిమా విడుదల తేదీలు ఉంటాయని పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆయన ఇప్పటికీ అలానే ఉన్నారని కితాబిచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత కష్టపడి పైకొచ్చింది చిరంజీవేనని ట్వీట్ చేశారు. డ్యాన్సులు, ఫైట్లు, చివరికి నడవాలన్నా, నిలబడాలన్నా మెగాస్టార్ నే ప్రేరణగా తీసుకుంటారని గణేశ్ ఎమోషనల్ గా పేర్కొన్నారు.