: వారిని క్షమించండి... రేపిస్టులపై కరుణ చూపిన కోల్ కతా నన్
సభ్య సమాజం తలదించుకునే పని చేసినా, వారిపై ఆ కరుణామయురాలు ప్రేమనే కురిపించింది. తనపై లైంగికదాడి చేసిన వారిని క్షమించాలని కోల్ కతాలో అత్యాచారానికి గురైన నన్ కోరారు. తన హృదయం పగిలిపోయిందని, అయినప్పటికీ తనకు వారిపై ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొన్నారు. రాణాఘాట్ లోని ఓ స్కూల్లో పనిచేస్తున్న ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, మనసులోని బాధను పక్కన పెట్టి పెద్ద మనసుతో వారిని క్షమించాలని అన్నారు. తన రక్షణకంటే, తన పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల భద్రత తనకు ముఖ్యమని తెలిపారు. ఇటువంటి సంఘటన తరువాత కూడా ఆమె నిర్మలమైన మనస్సుతో కనిపిస్తోందని, ఇది ఆమె మనోధైర్యానికి నిదర్శనమని డాక్టర్లు వెల్లడించారు.