: మేమిక మావోయిస్టులుగా మారాల్సిందే... మాకున్నది అదే దారి: జార్ఖండ్ యువకులు


వాళ్లు పోలీసులు కావాలని కలలు కన్నారు. విద్యార్హతలు ఉన్నాయి... పరీక్షలూ రాశారు. కానీ, ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఫలితాలు మాత్రం రావడంలేదు. నాలుగేళ్లు ముగిసినా ఫలితాలు వెల్లడి కాకపోవడంతో విసిగివేసారిపోయిన జార్ఖండ్ నిరుద్యోగులు తాము మావోయిస్టులుగా మారాలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జార్ఖండ్ ఆర్మ్‌డ్ పోలీసు విభాగంలోని తొమ్మిది బెటాలియన్లలో మొత్తం 1020 ఖాళీల భర్తీకి 2011లో పరీక్షలు జరిగాయి. తొలుత రెండు పరీక్షలు నిర్వహించిన పోలీసు శాఖ తుది పరీక్షను కూడా నిర్వహించారు. అయితే, ఇప్పటివరకు ఆ పరీక్షల ఫలితాలను వెలువరించలేదు. ఫలితాల వెల్లడిపై అభ్యర్థులు హైకోర్టుకెళ్లగా, వెంటనే వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు పోలీసు ఉన్నతాధికారులను, ప్రభుత్వాధికారులను, నేతలను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో, వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌ ను కలుసుకునేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. సీఎం ను కలిసేందుకు అపాయింట్ మెంట్ లభించకపోవడంతో రాంచీలోని పోలీసు అదనపు డెరైక్టర్ జనరల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఆత్మాహుతికి పాల్పడడమో లేక మావోయిస్టుల్లో చేరిపోవడమో తప్ప తమకు మరో మార్గం లేదంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News