: భోగాపురం వద్ద ఎయిర్ పోర్టు సిటీ!... పరిశీలించిన ఎయిర్ పోర్ట్ అథారిటీ
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఎయిర్ పోర్టు సిటీని నిర్మించనున్నారు. ఇందుకోసం ఆ మండల పరిసర ప్రాంతాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ బృందం పరిశీలించింది. ముందు భోగాపురంంలో బసవపాలెం నుంచి గూడెం మీదుగా దిబ్బలపాలెం ప్రాంతాలను పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఇక్కడి ప్రదేశం అనుకూలంగా ఉందా?, గాలి దిశ, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? లేదా? అని పరిశీలించామని ఎయిర్ పోర్ట్ అథారిటీ డైరెక్టర్ శ్రీవాస్తవ్ తెలిపారు. కాగా, ఈ ఎయిర్ పోర్టు సిటీ పదిహేను వేల ఎకరాల్లో ఉంటుందని తెలిసింది. అందులో విమానాశ్రయం ఐదువేల ఎకరాల్లో ఉంటుంది. మరో ఐదువేల ఎకరాల్లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవర్ హాలింగ్ కేంద్రం, ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సత్వర ఆమోదం తెలుపుతుందని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆశిస్తున్నారు.