: రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు ఇప్పట్లో లేవు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా యువరాజు రాహుల్ గాంధీ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారని, అందుకోసమే ఆయన నాలుగు వారాల పాటు సెలవు తీసుకున్నారన్న వార్తలు ఒట్టి పుకార్లేనట. సెలవు నుంచి రాగానే రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారని, ఇందుకోసం ఏప్రిల్ లో ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అవన్నీ పుకార్లని కొట్టిపారేశారు. పేరు వెల్లడించేందుకు ఇష్టపడని సదరు నేత మాట్లాడుతూ వచ్చే నెలలో అసలు ఏఐసీసీ సమావేశాలే జరగడం లేదని తేల్చేశారు. అంతేకాక ఈ ఏడాదిలో రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా లేవని ఆయన అన్నారు. వచ్చే ఏడాది నాటికి రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశాలున్నాయన్న ఆయన, అప్పటిదాకా తన తల్లి సోనియాతో కలిసి రాహుల్ పార్టీని నడిపిస్తారని పేర్కొన్నారు.