: మారిన పాక్... అనుమానిత తీవ్రవాదులను కొట్టి చంపిన ప్రజలు
ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులు పాకిస్థాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. నిన్న తాలిబాన్ ప్రేరేపిత ఆత్మాహుతి బాంబర్లు రెండు చర్చిలపై దాడిచేసి 14 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన ప్రజలు, ఇద్దరు అనుమానిత తీవ్రవాదులను కొట్టి చంపారు. బాంబు పేలుళ్ళ తరువాత ప్రజల నిరసన తార స్థాయికి చేరిందని, పనిలోపనిగా పలువురు వీధుల్లో వీరంగం సృష్టించారని పోలీసులు తెలిపారు. ప్రజలు కొట్టి చంపిన వారు ఆత్మాహుతి దాడి జరిపిన వారికి మద్దతుగా వచ్చినట్టు అనుమానిస్తున్నామని పోలీసుల ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ దాడి తామే చేశామని తాలిబాన్ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ పేరిట ప్రకటన వెలువడింది. షరియా ఇస్లామిక్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని, లేకుంటే ఎటువంటి ఘటనలు తప్పవని హెచ్చరించారు.