: అధికారంలోకి వచ్చిన ఐదో రోజునే హైకోర్టు విభజనపై లేఖ రాశాం: కేటీఆర్
టీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఐదో రోజునే హైకోర్టు విభజనపై సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు విభజనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుపడుతున్నారని అన్నారు. ఆయనను బీజేపీ నేతలు చంకన పెట్టుకుని ఊరేగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైకోర్టును విభజించాలని ఇప్పటికి మూడు సార్లు సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసి విన్నవించారని అయన తెలిపారు. రాష్ట్రాన్ని సాధించుకున్న తమకు హైకోర్టు సాధించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తక్షణం స్పందించి హైకోర్టును విభజించాలని ఆయన డిమాండ్ చేశారు.