: 238 పరుగులు చేస్తే క్వార్టర్ ఫైనల్స్ కు పాక్... చేయకుంటే ఐర్లాండ్, వెస్టిండీస్!
అడిలైడ్ లో ఐర్లాండ్ తో జరుగుతున్న పోరులో 238 పరుగులు సాధిస్తే పాకిస్తాన్ మరో సమీకరణాలతో సంబంధం లేకుండా నాకౌట్ దశకు చేరుతుంది. ఐర్లాండ్ ను ఇంటికి పంపుతూ, వెస్టిండీస్ 4వ స్థానంలో నిలిచి తదుపరి రౌండ్ కు అర్హత సాధిస్తుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 237 పరుగులు చేసింది. ఓపెనర్ పోటర్ ఫీల్డ్ 131 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 107 పరుగులు చేశాడు. ఆయనకు మరెవరూ అండగా నిలవలేక పోవడంతో భారీ స్కోర్ ను ఐర్లాండ్ చేయలేక పోయింది. స్టిర్లింగ్ 3, జాయ్ సీ 11, ఓబ్రియాన్ 12, బాల్ బిర్నీ 18, విల్సన్ 29, థాంప్సన్ 12, కెవిన్ ఓబ్రియాన్ 8, మూనీ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు వెస్టిండీస్ తో పాటు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత పొందుతారు. ఒక వేళ పరుగుల వేటలో పాక్ విఫలమైతే ఐర్లాండ్ తో పాటు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న వెస్టిండీస్ ముందడుగు వేస్తాయి.