: యాదవ్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలో లేను: సీతారామన్
దక్షిణాది మహిళలపై అసందర్భ వ్యాఖ్యలు చేసిన జేడీ (యూ) అధినేత శరద్ యాదవ్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది మహిళల చర్మసౌందర్యంపై ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకమని అన్నారు. యాదవ్ జాతీయ స్థాయిలో పేరున్న నేత అని, ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు తాను సభలో లేనని మంత్రి పేర్కొన్నారు. మీడియాలో చూసి స్పందిస్తున్నానని తెలిపారు. ఇలాంటి ధోరణులు ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. బీమా బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా శరద్ యాదవ్ దక్షిణ భారత దేశ మహిళలపై వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.