: వీడు మాకు తెలుసు... ఐఎస్ వీడియోలో ఉన్న బాలుడిని గుర్తించిన స్కూల్ మేట్స్
అత్యంత కిరాతకంగా బందీల ప్రాణాలను హరిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ఇప్పుడు బాలలను కూడా తన దళంలో చేర్చుకుంటోంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' తరపున ఏజెంటుగా పనిచేస్తున్నాడంటూ మహ్మద్ ముసల్లమ్ అనే యువకుడిపై ముద్రవేసి అతడిని చంపేసిన దృశ్యాలున్న వీడియోను ఐఎస్ గతవారం విడుదల చేయడం తెలిసిందే. బందీని చంపింది ఓ బాలుడు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఐఎస్ వైఖరి మరోమారు చర్చనీయాంశం అయింది. పిల్లలను కూడా ప్రాణాలు తీసే కర్కోటకులుగా మారుస్తోందంటూ అంతర్జాతీయ సమాజం తీవ్రంగా విమర్శించింది. కాగా, ఆ వీడియోలో తుపాకీతో కాల్చిన బాలుడు ఎవరన్న దానిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఫ్రాన్స్ లోని టౌలోజ్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో ఈ బాలుడు గతేడాది వరకు విద్యాభ్యాసం చేశాడని తెలిసింది. సోషల్ మీడియాలో ఐఎస్ వీడియోను వీక్షించిన సహ విద్యార్థులు వెంటనే ఆ బాలుడిని గుర్తుపట్టారు. తమతో చదువుకున్నవాడేనని తెలుసుకుని నివ్వెరపోయారు. ఐఎస్ వీడియోలో గడ్డంతో కనిపించిన వ్యక్తి బాలుడికి సవతి తండ్రి అయి ఉంటాడని భావిస్తున్నారు.