: రాహుల్ గాంధీ గురించి ఆరా తీసిన ఢిల్లీ పోలీసులు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఢిల్లీ పోలీసులు గతవారం ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారట. ఇందుకు కాంగ్రెస్ మండిపడింది. కారణం... రాహుల్ భౌతిక లక్షణాలైన ఎత్తు, కళ్లు, జుట్టు రంగు గురించి పోలీసులు ప్రశ్నించడమే! దాంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ ఈ విషయంపై ఫిర్యాదు చేయాలనుకుంటోంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల ఛానల్ వారు పోలీసులను అడిగితే, వివరాలు చెప్పేందుకు తిరస్కరించారు. సాధారణంగా చేసే ఎంక్వైరీ మాత్రమేనని, విదేశాల్లో ఉన్న రాహుల్ వెంట ఎంతమంది రక్షణ సిబ్బంది వెళ్లారన్న విషయాన్ని తెలుసుకునేందుకే వెళ్లామని చెప్పారు. అయితే, ఈ విషయంలో ఓ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులను కోరిందట. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత పీసీ చాకో మాట్లాడుతూ, రాహుల్ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం అత్యంత అభ్యంతరకరమని అన్నారు. కాగా, ఈ వారం ముగిసేలోగా రాహుల్ ఢిల్లీకి తిరిగివస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.