: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గీతా కపూర్ అరెస్ట్
వేగంగా కారు నడిపి ఓ పాదచారిని గాయపరిచిన ఘటనలో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గీతా కపూర్ ను అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున వెర్సోవా సమీపంలో జరిగింది. ఓ మెడికల్ షాప్ లో మందులు కొనుక్కొని ఇంటికి వెళ్తున్న నిసార్ నూర్ మహమ్మద్ (37) అనే వ్యక్తిని గీతా కపూర్ స్వయంగా నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితుడి కుడి కాలి ఎముక విరిగింది. ఆ వెంటనే కారు ఆపిన గీత అంబులెన్స్ పిలిపించి కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి బాధితుడిని తీసుకువెళ్ళింది. బాధితుడికి పరిహారం చెల్లించి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చూసుకోవాలని ఆమె ప్రయత్నించినప్పటికీ, పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 279, 338ల కింద కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ అయిన సమయంలో ఆమె మద్యం సేవించి లేదని నిర్ధారించుకున్న పోలీసులు ఆమెను బెయిల్ పై విడుదల చేశారు.