: మనకు ఓటేయడం మినహా వారికి మరోదారి లేదు... ముస్లింలపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత సమావేశాల్లో జరిగిన చర్చల ఆడియో వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నేత కేజ్రివాల్ మత రాజకీయాలు చేసినట్టు ఆడియో టేపులు విడుదలయ్యాయి. ఈ టేపులను ఆప్ నేత షహీద్ ఆజాద్ విడుదల చేశారు. ఎన్నికల్లో ముస్లింలకు టికెట్స్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించినట్టు ఆడియోలో వినిపిస్తోంది. మైనారిటీల ఓట్లు ఆప్ వైపే ఉన్నందున ఇంక వారికి టికెట్స్ ఇవ్వడం ఎందుకు? అని ఆయన అన్నట్టు సమాచారం. మొత్తం ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న ఈ టేపులో కేజ్రివాల్, ఆప్ మరో నేత ఇర్ఫానుల్లా ఖాన్ ల స్వరం వినిపిస్తోంది. ఆప్ కు ఓటేయడం మినహా ముస్లింలకు మరో మార్గం లేదని కేజ్రివాల్ అన్నారు. మోదీని నిలువరించాలంటే ఆప్ కు మాత్రమే సాధ్యమని ముస్లింలకు తెలుసునని కూడా ఆయన అన్నారు. ఈ ఆడియో టేపు ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది.