: హరీష్ రావు డైరెక్షన్ లో స్పీకర్... మీరు జోక్యం చేసుకోకపోతే రాష్ట్రపతిని కలుస్తాం: గవర్నర్ తో టీటీడీపీ నేతలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయని టీటీడీపీ నేతలు ఆరోపించారు. తమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరంతా గవర్నర్ నరసింహన్ ను కలిశారు. కేబినెట్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగడం, శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల విలీన ప్రకటన, టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఈ సందర్భంగా గవర్నర్ కు తెలిపారు. స్పీకర్ తన విచక్షణ మేరకు వ్యవహరించడం లేదని... హరీష్ రావు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని ఆరోపించారు. జాతీయగీతాన్ని తాము అవమానించినట్టైతే క్షమాపణ కోరాలని స్పీకర్ అడగాలని... కానీ, స్పీకర్ కంటే ముందే హరీష్ రావు డిమాండ్ చేశారని చెప్పారు. ఈ విషయంలో కలగజేసుకొని సమస్యను పరిష్కరించాలని గవర్నర్ ను కోరారు. లేకపోతే, రాష్ట్రపతిని కలుస్తామని గవర్నర్ కు చెప్పారు.