: ప్రసంగం వద్దు... నిరసన చాలు... జగన్ పై కోడెల చికాకు
విపక్షంలో ఉన్న తాము ఏదైనా మాట్లాడతామని వైకాపా అధినేత జగన్ అనడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ చికాకు పడ్డారు. ఏదైనా మాట్లాడతామనడం సరికాదని ఆయన సూచించారు. అంగన్ వాడీ వర్కర్ల సమస్యలపై చర్చించాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో అసెంబ్లీలో రభస మొదలైంది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటే, తొలుత సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం నిరసన తెలపాలని స్పీకర్ ను మైక్ అడిగితీసుకున్న జగన్ తనదైన శైలిలో ప్రసంగించడం మొదలుపెట్టారు. దీన్ని అడ్డుకున్న కోడెల ప్రసంగాలు వద్దు, నిరసన మాత్రమే తెలపాలని కాస్తంత ఘాటుగానే అన్నారు. దీంతో మరోసారి గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో సభను మరో 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.