: 'ఇండియాస్ డాటర్'కు కౌంటర్ ఇదిగో... 'యూకేస్ డాటర్' తీసిన భారతీయుడు!
భారత్ లో సంచలనం సృష్టించిన 'నిర్భయ' అత్యాచారం ఉదంతాన్ని 'ఇండియాస్ డాటర్' పేరుతో బ్రిటన్ కు చెందిన లెస్లీ ఉడ్విన్ డాక్యుమెంటరీగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ డాక్యుమెంటరీ వాస్తవ విరుద్ధంగా ఉందంటూ భారత్ లోని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమంది. నిర్భయపై అఘాయిత్యం చేసిన రేపిస్టులు ఆ డాక్యుమెంటరీలో ఎక్కడా పశ్చాత్తాప పడకపోగా, నిర్భయ కారణంగానే తాము రేప్ కు పాల్పడాల్సి వచ్చిందని నిస్సిగ్గుగా చెప్పారు. భారత్ అంటే అత్యాచారాలకు పెట్టింది పేరన్న రీతిలో ఆ డాక్యుమెంటరీ నిర్మించారు. బీబీసీలో ప్రసారమైన ఆ డాక్యుమెంటరీపై భారత్ లో నిషేధం విధించారు కూడా. ఇప్పుడు దానికి కౌంటర్ గా హర్వీందర్ సింగ్ అనే భారతీయుడు 'యునైటెడ్ కింగ్ డమ్స్ డాటర్' పేరుతో ఓ డాక్యుమెంటరీ నిర్మించాడు. పాశ్చాత్య దేశాల్లో మహిళల వెతలు, ముఖ్యంగా ప్రతిరోజూ యూకేలో 250 మంది స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్న వైనాన్ని తన డాక్యుమెంటరీలో వివరించాడు. యూకేలో 10 శాతం మహిళలు లైంగిక దాడుల బాధితులని డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.