: 30 ఏళ్లుగా వాళ్లు బాహ్య ప్రపంచాన్ని చూడలేదు... సిక్కు వ్యతిరేక అల్లర్ల ఫలితం!
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు ప్రపంచానికి దూరంగా ఇంట్లో గడిపేశారు ఓ కుటుంబానికి చెందిన సభ్యులు. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను చూసిన రైల్వే ఉద్యోగి జోగీందర్ సింగ్ బేడీ కుటుంబ సభ్యులు ఏకంగా 30 ఏళ్లు ఇంట్లోనే ఉండిపోయారు. అతని భార్య నిర్మల్ కౌర్, కుమార్తె కమల్ జీత్, కొడుకు ఇందిరాపాల్ సింగ్ లు షాక్ కు గురయ్యారు. ఇంటి బయటకోస్తే తమను ఎవరైనా చంపేస్తారని భయపడి బయటి ప్రపంచంలోనికి రావడం మానేశారు. అలహాబాద్ దగ్గర్లోని మొగ పట్టణంలో నివసించే వీరిని జోగీందర్ తనతో పాటు అలహాబాద్ రమ్మన్నా రారట. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే.... వాళ్లు బయటకు రారు, జోగీందర్ ను లోపలికి రానివ్వరట. ఆయనే నెలకొకసారి నిత్యావసర సరకులన్నీ తీసుకుని వెళ్లి వారికి ఇస్తారు. కనీసం తనను ఇంట్లో ఉండనివ్వమన్నా ఉండనివ్వరని ఆయన వాపోయారు. నాలుగేళ్ల క్రితం విద్యుత్ బిల్లు కట్టకపోవడం వల్ల సరఫరా నిలిపేశారట. అయినా చీకట్లోనే గడిపేశారు కానీ, బయటికి రాలేదు. దీంతో, వారేమైపోతారో అని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి, వారిని బయటకు తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారని ఆయన తెలిపారు. తనను ముట్టుకుంటే చంపేస్తానని తన కుమార్తె బెదిరించిందని, దాంతో పోలీసులు నిచ్చెన సాయంతో లోపలికి దిగి వారిని బయటకు తీసుకువచ్చారని ఆయన చెప్పారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో వారిని మానసిక చికిత్సాలయంలో ఉంచారట. ఇప్పుడు తన వయసు 70 ఏళ్లని, రిటైర్ అయి చాలా కాలం అయిందని, ఇప్పటికైనా తన కుటుంబం మామూలుగా మారితే చాలని జోగీందర్ సింగ్ కోరుకుంటున్నాడు. సిక్కు వ్యతిరేక అల్లర్లు తన కుటుంబంలో తీరని చిచ్చురేపాయని ఆయన అభిప్రాయపడుతున్నాడు.