: సోషల్ మీడియాలో ప్రాంతీయ విద్వేషాలే అతనిని బలిగొన్నాయి!


ప్రాంతీయ విద్వేషాలు పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక ప్రాంతీయ విద్వేషం రేగుతూనే ఉంది. విద్యావంతులైన యువకుల్లో పెరుగుతున్న అసంతృప్తి ఫలితంగానే ప్రాంతీయ భావాలు పొడసూపుతున్నాయి. ప్రాంతీయభావం కారణంగానే నాగాలాండ్ లోని దిమాపూర్ ఘటన జరిగినట్టు తెలిసింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సయ్యద్ షరీఫ్ ఖాన్, అతని స్నేహితుడు దిమాపూర్ జైలులో ఒకే గదిలో ఉన్నారు. షరీఫ్ ఖాన్ బంగ్లాదేశీయుడని, నాగా యువతులపై బయటి వ్యక్తుల అత్యాచారాలు చేస్తున్నప్పటికీ యువతులు స్పందించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. "నాగాలాండ్ యువతకు రావాల్సిన ఉద్యోగాలు అసోం, బీహార్, మణిపూర్, బంగ్లాదేశ్ వలసదారులు కొట్టేస్తున్నారు. అదే సమయంలో వారిపై అత్యాచారం కూడా చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా నాగా యువత రక్తం ఉడకడంలేదు" అంటూ సామాజిక మాధ్యమంలో యువతను రెచ్చగొట్టారు. దీంతో, స్థానికులు జైలులో చొరబడి బంగ్లాదేశీయుడిగా భావించిన షరీఫ్ ఖాన్ ను బయటకు ఈడ్చుకువచ్చి రాళ్లతో కొట్టి చంపారు. ఈ సందర్భంగా 'నాగా యువతులపై బంగ్లా వలసదారుల అత్యాచారాలకు ఇదే చరమగీతం' అంటూ నినాదాలు చేశారని, అదే కూడలిలో ఉండే ఓ బంగ్లాదేశ్ కు చెందిన షాపు యజమాని చెప్పాడు. ఈ కేసులో షరీఫ్ ఖాన్ వాంగ్మూలమిస్తూ తాను ఆ యువతి దగ్గరకు డబ్బులిచ్చి వెళ్లేవాడినని, అయితే ఈసారి మరింత డబ్బు కావాలనడంతో తాను ఇవ్వలేదని, అందుకే ఆమె తనపై అత్యాచారం కేసు మోపిందని తెలిపాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

  • Loading...

More Telugu News