: భారత్ లో రెడ్ ఎంఐ 2, ఎంఐ ప్యాడ్ టాబ్లెట్ లను విడుదల చేసిన షియోమి
చైనా యాపిల్ సంస్థగా పేరున్న షియోమి తాజాగా మరో స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లను భారత మార్కెట్లో విడుదల చేసినట్టు ప్రకటించింది. 'రెడ్ ఎంఐ 2' పేరిట స్మార్ట్ ఫోన్తో పాటు, 'ఎంఐ ప్యాడ్' పేరిట కొత్తతరం టాబ్లెట్ ను విడుదల చేసింది. వీటిలో రెడ్ ఎంఐ 2 ధరను రూ. 6999గా నిర్ణయించామని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్లు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతాయని, ఇ- కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో మార్చి 24వ తేదీన ఫ్లాష్ అమ్మకాలు ఉంటాయని పేర్కొంది. తొలి విడతగా 30 నుంచి 40 వేల ఫోన్లు అమ్మే అవకాశం ఉన్నట్లు షియోమి ఇండియా హెడ్ మను జైన్ వివరించారు. ఈ ఫోన్లో 4.7 అంగుళాల డిస్ప్లే, క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, 4జి డ్యూయల్ సిమ్ ఉంటాయని, 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయని తెలిపారు. కాగా, ఎంఐ ప్యాడ్ ట్యాబ్ ధర రూ. 12,999గా ఉండగా, 7.9 అంగుళాల డిస్ప్లే ఉందని, వై-ఫై ఆధారంగానే పనిచేస్తుందని అన్నారు. ఎంఐ ప్యాడ్ లను కూడా మార్చి 24న అమ్మకాలకు పెట్టనున్నట్టు తెలియజేశారు.