: ధావన్ తో భాగస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నా: రోహిత్
ఈ వరల్డ్ కప్ లో తన స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించకున్నా రెండు అర్థసెంచరీలతో రోహిత్ శర్మ ఓ మోస్తరుగా రాణించాడు. తాజాగా, మీడియాతో మాట్లాడుతూ, టీమిండియా ప్రస్థానంపై అభిప్రాయాలు పంచుకున్నాడు. సహ ఓపెనర్ శిఖర్ ధావన్ తో భాగస్వామ్యాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరికీ మధుర స్మృతులు ఉన్నాయని పేర్కొన్నాడు. తమ కెరీర్లో గడ్డుకాలం ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదన్నాడు. జట్టు కోరుకున్న విధంగా శుభారంభం ఇస్తుండడం పట్ల సంతోషంగా ఉందని తెలిపాడు. ఓపెనర్లుగా మిడిలార్డర్ కు అనువుగా రంగం సిద్ధం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఈ ముంబైవాలా అభిప్రాయపడ్డాడు. ఇక, తన వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడుతూ, శుభారంభాల్ని భారీ స్కోర్లుగా మలచాల్సి ఉందన్నాడు. దురదృష్టవశాత్తూ తక్కువ స్కోర్లకే వెనుదిరుగుతున్నానని తెలిపాడు. ఇలాంటి భారీ టోర్నమెంట్లు ఆటగాళ్ల సత్తాను వెలికితీస్తాయని అభిప్రాయపడ్డాడు.