: నేను అమాయకుడ్ని... అందుకే లొంగిపోయాను: అవినాష్
"నేను అమాయకుడ్ని" అని అంటున్నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తదితర ప్రాంతాల్లో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి, 14 లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన అవినాష్ (25). పోలీసుల కంటబడకుండా డీజీపీ కార్యాలయంలో ఎన్టీవీ సహాయంతో లొంగిపోయాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తనను వివాదంలో అనవసరంగా ఇరికించారని అన్నాడు. తనపై వస్తున్న ఫిర్యాదులకు తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ వెల్లడించాడు. తాను ఎవరి దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేయలేదని చెప్పాడు. అప్పట్లో వైజాగ్ లో అమ్మాయిలను ఏడిపించిన వారిని స్నేహితులతో కొట్టించిన వీడియోలు ఎలా బయటికి వచ్చాయో కూడా తెలియడం లేదని అవినాష్ తెలిపాడు. తనపై ఫిర్యాదు చేసిన మహిళ టీచర్ అని, ఆమె తనకు గతంలో అప్పుగా డబ్బులు ఇచ్చిందని అవినాష్ పేర్కొన్నాడు. కొందరికి భయపడే పరారయ్యానని వివరించాడు. కాగా, అవినాష్ సమాధానాలపై ఇంకెన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అవినాష్ ఎవరికి భయపడ్డాడు? పోలీసులకే భయపడితే డీజీపీ కార్యాలయంలో ఎలా లొంగిపోగలిగాడు? మూడు రోజుల పాటు పోలీసులను ఎలా ఏమార్చగలిగాడు? ఎప్పుడో రికార్డయిన వీడియోను అతనిపై ఫిర్యాదు చేసిన మహిళకు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అవినాష్ పేర్కొంటున్నట్టు అమాయకుడైతే మానవహక్కుల ప్రతినిధినంటూ స్కూళ్లలో తనిఖీలు ఎలా నిర్వహించగలిగాడు? మూడేళ్ల క్రితం భద్రాచలంలో స్మగ్లింగ్ కేసు నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? వంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి.