: రాజయ్య చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... ‘మెడికల్’ మాజీ డైరెక్టర్ సాంబశివరావు ఇంటిపై ఏసీబీ దాడులు
అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో తెలంగాణ డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్ కు గురైన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పేలా లేదు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. రాజయ్య అండను ఆసరా చేసుకుని ఆ శాఖ డైరెక్టర్ సాంబశివరావు చేతివాటం ప్రదర్శించినట్లు నాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా నేడు వరంగల్ లోని ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సాంబశివరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ ఏకకాలంలో దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో రాజయ్య అవినీతికి సంబంధించిన కీలక పత్రాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే జరిగితే, ఇప్పటికే పదవి కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న రాజయ్య, మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదు.