: కేసీఆర్ సొంత జిల్లాలో లాకప్ డెత్... పోలీసుల చిత్రహింసలతో నిందితుడు మృతి
తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో లాకప్ డెత్ చోటుచేసుకుంది. జిల్లాలోని పుల్కల్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నిందితుడు లక్ష్మణ్ చనిపోయాడు. ఓ హత్యకేసు విచారణ నిమిత్తం మూడు రోజుల క్రితం లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్ రాత్రి మరణించాడు. విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల చిత్రహింసల కారణంగానే లక్ష్మణ్ మరణించాడని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్రహింసల నేపథ్యంలో కుప్పకూలిన లక్ష్మణ్ ను పోలీసులు సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ్ ను పరిశీలించిన అక్కడి వైద్యులు అతడు మరణించాడని నిర్ధారించారు.