: కడప ఎంపీ భార్య పేరిట దొనకొండ సమీపంలో భూములు
కడప ఎంపీ, వైకాపా అధినేత జగన్ దగ్గరి బంధువు అవినాష్ రెడ్డి భార్య పేరిట దొనకొండ సమీపంలోని కొనకనమిట్లలో భూములు కొనుగోలు చేసినట్లు అక్కడి రైతులు సహచట్టం ద్వారా సేకరించిన వివరాల్లో వెలుగుచూసింది. కొనకనమిట్లలోని వివిధ సర్వే నంబర్లలో మొత్తం 559.37 ఎకరాల లావాదేవీలు గత ఏడాది ఆగస్టు నుంచి నవంబరు వరకు చేతులు మారినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల వివరాల ప్రకారం అవినాష్ రెడ్డి భార్య సమత పేరిట 10.05 ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆయన మామ గండ్లూరి వీరప్రతాప్‌రెడ్డి ఎండీగా ఉన్న వీరభద్ర మినరల్స్ పేరిట 146.22 ఎకరాలు, వీరప్రతాప్ రెడ్డి పేరిట 147 ఎకరాలు, అత్త లక్ష్మీదేవి పేరిట 30.23 ఎకరాలు, మరదలు గుగ్గుళ్ల శ్వేత పేరిట 10.10 ఎకరాలు, అవినాష్‌రెడ్డి బావమరిది వీరశివారెడ్డి పేరిట 40.29 ఎకరాలు కొనుగోలు చేశారని సమాచారం. ఈ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవల కొనకనమిట్లలో జరిగిన ఓ హత్య కేసులో అవినాష్ రెడ్డి బంధువుల పేర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.