: ఇక ఏపీ వంతు... నేడు సభ ముందుకు యనమల ‘సామాన్యుడి’ బడ్జెట్!
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నిన్న తన వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇక ఏపీ వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు గతేడాది మధ్యంతర బడ్జెట్ తో సరిపెట్టగా, ఈ ఏడాది రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయి బడ్జెట్ ను రూపొందించాయి. తెలంగాణ కంటే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఇప్పటికే మీడియాకు చెప్పిన యనమల, ఏఏ అంశాలపై దృష్టి సారించారనే అంశం మరికొద్ది గంటల్లో తేలనుంది. సామాన్యుడి బడ్జెట్ నే తాము రూపొందించామని ఆయన చెబుతున్నారు. కొత్తగా పన్నులేవీ ఉండబోవని ప్రకటించిన ఆయన, ప్రజల ఆశయాలకనుగుణంగానే బడ్జెట్ ను రూపొందించామని పేర్కొన్నారు. అసెంబ్లీలో నేటి మధ్యాహ్నం 12.15 గంటలకు యనమల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ బడ్జెట్ ను ప్రవేశపెడతారు.