: సొంత ఫ్యామిలీని లేపేసేందుకు క్లాస్ మేట్ తో అగ్రిమెంట్!
అమెరికాలో విద్యార్థి దశలోనే పిల్లల్లో విపరీత భావాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా, కుటుంబ వ్యవస్థలోని లోపాలు వారిని అలా తయారుచేస్తున్నాయన్నది సామాజికవేత్తల అభిప్రాయం. తాజాగా, ఓ 14 ఏళ్ల బాలుడు సొంత కుటుంబాన్ని చంపేందుకు క్లాస్ మేట్ ను పురమాయించడం కలకలం రేపింది. వివరాల్లోకెళితే... ఫ్లోరిడాలో ఉంటున్న ఈ విద్యార్థి తనకు తక్కువ మార్కులు వస్తున్నాయని తండ్రి, సవతి తల్లి, సవతి సోదరుడు వేధిస్తుండడంతో వారిపై కక్షగట్టాడు. వారినెలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని క్లాస్ మేట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన కుటుంబాన్ని చంపేస్తే 1200 డాలర్లు (రూ.75000) ఇస్తానని కాంట్రాక్టు పత్రాన్ని కూడా సిద్ధం చేశాడు. హత్యాకాండను దోపిడీగా చిత్రీకరించాలని కూడా ప్లాన్ చేశాడు. అయితే, ఆ నోట్ ను సదరు విద్యార్థి తండ్రి చూడడంతో కథ అడ్డం తిరిగింది. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ బాలుడిని అరెస్టు చేశారు. తన పట్ల కుటుంబ సభ్యులు అనుసరిస్తున్న వైఖరి కారణంగానే వారిని చంపేయాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నానని పోలీసులకు తెలిపాడు. హత్యకు పురిగొల్పాడంటూ అతడిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.