: కేజ్రీవాల్ కు సవాలు విసిరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సచ్ఛీలుడు కాదని, పదవీలోలుడని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ అంటున్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పదవి కాపాడుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాలకు సంబంధించి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయానికి సంబంధించిన ఆడియో టేపులను గార్గ్ బయటపెట్టారు. ఆప్ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పరచిన తరువాత పూర్తి మెజారిటీ లేకపోవడంతో సీఎం పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక కేజ్రీ టెన్షన్ పడ్డారని, దీంతో కాంగ్రెస్ పార్టీలోని కొందరిని కొనేయాలని నిర్ణయించుకున్నారని గార్గ్ చెబుతున్నారు. అయితే, ఆ పథకం ఫలించలేదట. ఇంతలోనే సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. పదవిని కాపాడుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాలకు సంబంధించి తనవద్ద మరెన్నో ఆధారాలు ఉన్నాయని గార్గ్ చెబుతున్నారు. కేజ్రీవాల్ చేతనైతే తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు. ఈ ఆడియో పుటేజ్ బయటకు వచ్చిన నేపథ్యంలోనే మహారాష్ట్ర ఆప్ కన్వీనర్ అంజలి దమానియా రాజీనామా చేశారు. కేజ్రీవాల్ కు సైద్ధాంతికంగానే మద్దతిచ్చామని, పదవుల కోసం బేరసారాల విషయంలో మద్దతివ్వలేదని ఆమె పేర్కొనడం గమనార్హం.