: విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్ కుమార్
బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. అనుకూలంగా 140 ఓట్లు రావడంతో విశ్వాస పరీక్షలో విజయవంతమయ్యారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ సమయంలో సభ నుంచి వాకౌట్ చేశారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా నితీశ్ గత నెల 22న ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో మార్చి 11న బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కోరారు. దాంతో, స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి మినహా, తన మిగతా సభ్యులకు సభలో జేడీ(యు) విప్ జారీ చేసింది. అంతకుముందు, మళ్లీ తాను సీఎం అవ్వాలని నితీశ్ అనుకుని మాజీ సీఎం జితన్ రాం మాంఝీని వైదొలగాలని కోరడం, అందుకు మాంఝీ అంగీకరించకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండురోజుల పాటు పెద్ద డ్రామా జరిగింది. చివరికి మాంఝీ రాజీనామా చేశారు.