: భూసేకరణ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించండి: హజారే పిలుపు
భూసేకరణ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధిలో ఆయన మాట్లాడుతూ, బయట ప్రజలు, రాజ్యసభలో ప్రతిపక్షాలు ఏకమై భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించాలని అన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రజాప్రయోజనాలను కాలరాసేందుకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తించాలని సూచించారు. కాగా, భూసేకరణ బిల్లుపై ఈ నెలాఖరున ఆయన పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే.