: ఇండియన్ రైల్వేస్ లో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎల్ఐసీ
వచ్చే ఐదేళ్లలో భారతీయ రైల్వేలో రూ. 1.5 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. ఈ మేరకు రైల్వేస్ ఆర్థిక విభాగం కమిషనర్ రాజ్యలక్ష్మీ రవికుమార్, ఎల్ఐసీ చైర్మన్ ఎస్.కె.రాయ్ లు బుధవారం నాడు ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంఓయూలో భాగంగా సాలీనా రూ. 30 వేల కోట్లను ఎల్ఐసీ పెట్టుబడిగా అందించనుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసీ తన నిధులతో ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. వాణిజ్యపరంగా లాభాలను అందించే ప్రాజెక్టులను చేపట్టే దిశగా ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ సీ) విడుదల చేసే బాండ్లను ఎల్ఐసీ కొనుగోలు చేయనుంది. రైల్వేల్లో పెట్టుబడులు తమకు లబ్ధిని చేకూరుస్తాయని భావిస్తున్నామని ఈ సందర్భంగా ఎల్ఐసీ చైర్మన్ ఎస్.కె.రాయ్ వ్యాఖ్యానించారు.