: ఒక్క మహిళకు రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా: చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క మహిళ రుణాన్ని మాఫీ చేసినట్టు నిరూపిస్తే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ సభ్యుడు కొడాలి నాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా పేదల సొంతింటి కల నెరవేర్చేలా ఒక్క రుణం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిదని, ఆయన చనిపోయిన రోజే పోలవరం ప్రాజెక్టు కూడా చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును మర్చిపోయేలా చేసేందుకే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని కేంద్రం నిర్మిస్తే తమకేమీ మిగలదన్న ఉద్దేశంతోనే బాబు సర్కారు తామే నిర్మిస్తామంటోందని అన్నారు.