: జట్టు నాకౌట్ కు అర్హత సాధించకున్నా... ‘టాప్’ లేపిన స్కాట్లాండ్ బౌలర్


వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ స్కాట్లాండ్ పరాజయాన్నే మూటగట్టుకుంది. తాజాగా నేడు లంకతో జరుగుతున్న మ్యాచ్ లోనూ పరాజయం దిశగా పయనిస్తోంది. అయితే ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హెన్రీ డేవీ మాత్రం టాప్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆడిన ఐదు మ్యాచ్ లలో అతడు 14 వికెట్లు తీశాడు. అయితే తన జట్టు వైఫల్యంతో డెవీ ప్రతిభ వెలుగులోకి రాలేదు. రికార్డుల మోత మోగుతున్న వరల్డ్ కప్ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో న్యూజిలాండ్ బౌలర్లు బౌల్ట్, టిమ్ సౌథీలు 13 వికెట్లతో నిన్నటిదాకా అగ్రస్థానంలో ఉన్నారు. నేటి మ్యాచ్ లో డెవీ వారిద్దరినీ వెనక్కు నెట్టేసి టాప్ పొజిషన్ చేజిక్కించుకున్నాడు. లంకతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన డెవీ... న్యూజిలాండ్ పై మూడు, ఇంగ్లండ్ పై నాలుగు, ఆఫ్ఘానిస్థాన్ పై రెండు, బంగ్లాదేశ్ పై రెండు వికెట్లు పడగొట్టాడు. వరుస వైఫల్యాలతో జట్టు ఇప్పటికే నాకౌట్ కు అర్హత కోల్పోయిన నేపథ్యంలో అతడి స్థానాన్ని త్వరలోనే వేరే బౌలర్లు చేజిక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News