: అప్పుడు రేపిస్టు అన్నారు... ఇప్పుడు వరల్డ్ కప్ హీరో అంటున్నారు!


బంగ్లాదేశ్ జట్టు వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్ చేరడం మామూలు విషయం కాదు. అగ్రశ్రేణి జట్లున్న గ్రూప్-ఎ నుంచి నాకౌట్ దశకు చేరడం, ఈ క్రమంలో ఇంగ్లండ్ వంటి అగ్రశ్రేణి జట్టును ఏకంగా వరల్డ్ కప్ నుంచి ఇంటికి పంపడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టుపై స్వదేశంలో అభినందనల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా, ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి కారకుడైన పేసర్ రూబెల్ హుస్సేన్ (25) ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఒక్క మ్యాచ్ తో బంగ్లాదేశ్ లో స్టార్ అయిపోయాడు. అతను రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అని క్రికెట్ అభిమానులు మర్చిపోయేంతలా హుస్సేన్ స్టార్ డమ్ పైకెగసిింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే... హుస్సేన్ పై ఆరోపణలు చేసిన నటి నజ్నీన్ అక్తర్ (19) కేసును ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని సదరు నటీమణి కేసు పెట్టింది. దీంతో, హుస్సేన్ వరల్డ్ కప్ కు వెళ్లేది అనుమానంగా మారినా, దేశ ప్రయోజనాల దృష్ట్యా అతనికి వరల్డ్ కప్ ముగిసేంతవరకు బెయిల్ మంజూరు చేశారు. ఇంగ్లండ్ తో మ్యాచ్ అనంతరం నజ్నీన్ ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, తాను హుస్సేన్ ను క్షమించేశానని, కేసును కొనసాగించాలని భావించడం లేదని వెల్లడించింది. అతడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సమర్పించబోవడంలేదని, అలాంటప్పుడు ఇక కేసే లేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News