: క్లిష్ట పరిస్థితుల్లో అతడివైపే చూస్తా: ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ కప్ లో జట్టు సహచరుల ప్రదర్శనపై మురిసిపోతున్నాడు. ముఖ్యంగా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఓపెనర్ శిఖర్ ధావన్ లను ఆకాశానికెత్తేస్తున్నాడు. అశ్విన్ వంటి ఆటగాడు జట్టులో ఉండడాన్ని ఎప్పుడూ ఇష్టపడతానని తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లో అతడినే బౌలింగుకు దింపుతానని పేర్కొన్నాడు. పవర్ ప్లేల్లో బౌలింగ్ చేయమని అశ్విన్ ను ఎన్నోసార్లు ప్రోత్సహించానని తెలిపాడు. తన బౌలింగ్ పై మంచి అవగాహన అశ్విన్ సొంతమని కితాబిచ్చాడు. ఇక, శిఖర్ ధావన్ గురించి చెబుతూ, ఆటతీరును ఎంతో మెరుగుపర్చుకున్నాడని కొనియాడాడు. ఆసీస్ పర్యటనలో పెద్దగా రాణించకపోయినా, ధావన్ లో ప్రయత్నలోపం లేదని గుర్తించానని, అందుకే అతడికి మద్దతుగా నిలిచానని ధోనీ వివరించాడు. చాంపియన్స్ ట్రోఫీలో ధావన్ భాగస్వామ్యం లేకపోతే కప్ గెలిచేవాళ్లం కాదని అభిప్రాయపడ్డాడు.