: గుజరాత్ తరువాత తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రం: కేసీఆర్
దేశంలోని రెండు ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతుందని ముందే చెప్పానన్నారు. గుజరాత్, తెలంగాణ మిగులు నిధులున్న రాష్ట్రాలని 14వ ఆర్థిక సంఘం తేల్చిందని పేర్కొన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం, జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువేనని వెల్లడించారు. అందుకు తాను గర్వపడుతున్నానన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆదాయం కొంతమేర పెరిగిందని, ప్రస్తుతం ఎఫ్ఆర్ బీఎం రూ.14 వేల కోట్లుగా ఉందని వివరించారు. జీవో 59 కింద రాష్ట్రానికి రూ.133.5 కోట్లు సమకూరిందని తెలిపారు. గతంలో ప్రణాళికా సంఘం పూర్తిగా కేంద్రం అజమాయిషీలో ఉండేదని, కానీ ఇప్పుడు నీతి అయోగ్ లో అన్ని రాష్ట్రాల సీఎంలూ సభ్యులేనని, మన గొంతు కూడా వినిపించవచ్చునని పేర్కొన్నారు.