: అతని రక్తం నిండా భారత వ్యతిరేకతే!
పార్లమెంటును కుదిపేసిన హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీకి వారసుడుగా భావిస్తున్న మసరత్ ఆలం భారత వ్యతిరేకవాది. 2008-10 మధ్యకాలంలో జమ్మూకాశ్మీర్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు మళ్లీ జరగకూడదంటే ఆలం జైల్లోనే ఉండాలని శ్రీనగర్ డీసీపీ పేర్కొన్నాడంటే... అతనిలో భారత వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలం నరనరాన భారత్ వ్యతిరేకత ప్రవహిస్తుంది. మధ్యతరగతిలో జన్మించిన మసరత్ ఆలం డిగ్రీ వరకు చదువుకున్నాడు. 2008లో అరెస్టైన ఆలం 2010 వరకు జైల్లో ఉన్నాడు. అంతకుముందు, 1989 నాటి సాయుధ తిరుగుబాటును సమర్థించడంతో 1996 వరకు జైలు తప్పలేదు. విడుదలయ్యే సమయానికి కాశ్మీర్ అల్లర్లతో అట్టుడుకుతూ ఉండేది. దానిని అవకాశంగా తీసుకున్న ఆలం ‘క్విట్ కాశ్మీర్’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ‘భారత్ కో దే రగ్డా’ అనే భారత వ్యతిరేక గేయాన్ని, ‘గో ఇండియా గో’ అనే నినాదాన్ని కాశ్మీర్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. వారంలో ఏ రోజు ఏ ఆందోళన చేయాలో తెలిపే కేలండర్ రూపొందించాడు. వీధుల్లో నిరసనలు, సాయుధ బలగాలపై రాళ్ల దాడులు తదితర వ్యూహాలతో వేర్పాటువాదుల్లో పాప్యులారిటీ సంపాదించాడు. అతని ఆగడాలు మితిమీరడంతో అతనిని 2010 అక్టోబర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో, మస్రత్ ఆలంను ముఫ్తీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇతని విడుదలపై పార్లమెంటులో ప్రధాని మాట్లాడుతూ, అన్ని అంశాలూ పరిశీలిస్తున్నామని, అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరైందని వివరించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.