: 'బాబూ, బాబూ! నేను మోదీని మాట్లాడుతున్నా... జగన్ నా దగ్గరికి వచ్చాడు' అంటూ ఫోన్ వచ్చిందా?: అసెంబ్లీలో జగన్ ఎదురుదాడి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేతల ఢిల్లీ పర్యటనలపై ఆసక్తికర చర్చ జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతుండగా, ఆర్థిక మంత్రి యనమల జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, అప్పట్లో సోనియా, ప్రణబ్ ముఖర్జీల చుట్టూ తిరిగారు... ఇప్పుడు మోదీ, జైట్లీల చుట్టూ తిరుగుతూ కేసుల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన జగన్ తాను ఢిల్లీకి కేవలం సమస్యలపై చర్చించేందుకే వెళ్లానని, అర్జీలు తీసుకెళ్లానని, వాటిని మీడియా ముందు పెట్టే వెళ్లానని స్పష్టం చేశారు. "ఏనాడైనా, బాబూ బాబూ నేను మోదీని మాట్లాడుతున్నా... జగన్ నా దగ్గరికి వచ్చాడు, ఈ విషయాలపై మాట్లాడాడు... అని మోదీ గానీ, 'చంద్రబాబూ! జగన్ వచ్చి నాతో ఇలా మాట్లాడాడు... అని జైట్లీ గానీ ఫోన్ చేశారా?" అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే జగన్ మాట్లాడటం లేదని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.